peddireddy ramachandra reddy: టీడీపీ వాళ్లతో జతకడితే ఎలా? వాళ్లతో ఏం పని?: పార్టీ నేతలకు వైసీపీ నేత పెద్దిరెడ్డి క్లాస్
- పనుల కోసం టీడీపీతో కుమ్మక్కు కావడం మంచిది కాదు
- నిబంధనల మేరకు పనులు చేస్తేనే.. ప్రజలకు మేలు చేసినవారమవుతాం
- మండలంలో వైసీపీ బలంగా ఉంది
తమ పార్టీ నేతలను ఉద్దేశించి వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. పులిచెర్ల మండలం (చిత్తూరు జిల్లా)లోని వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ వాళ్లతో జతకడితే ఎలాగని ఆయన ప్రశ్నించారు. వాళ్లతో మీకు ఏం పని? అని మండిపడ్డారు. పులిచెర్లలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో మండలంలో 11 మంది ఎంపీటీసీలకు గాను 10 మందిని, 25 మంది సర్పంచ్ లకు గాను 20 మందిని, వీరితో పాటు ఎంపీపీ, జడ్పీటీసీలను గెలిపించుకున్నామని అన్నారు. మండలంలో వైసీపీ ఇంత బలంగా ఉన్నప్పటికీ... పనుల కోసం టీడీపీతో కుమ్మక్కు కావాలనుకోవడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. పనుల కోసం దొడ్డి దారిలో వెళ్లవద్దని, నిబంధనల మేరకు పనులు చేపడితేనే ప్రజలకు మేలు చేసినవారమవుతామని చెప్పారు.