Telangana: తుమ్మలా.. మీ ప్రాంతంలో ఇంకా కరువుంది కదా.. ఏం చేద్దాం? అని కేసీఆర్ అడిగారు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- సీతారామా ప్రాజెక్టుకు రూ.13 వేలకోట్లు ఇచ్చారు
- ఒక్క సంతకంతో పామాయిల్ ధరను పెంచారు
- జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలి
దేశ చరిత్రలో వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినంత ప్రాధాన్యం ఇంకెవరూ ఇవ్వలేదని టీఆర్ఎస్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ప్రాజెక్టులను కేటాయించారనీ, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ఆశీర్వదించాలని కోరారు. జిల్లాలోని పాలేరులో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో తుమ్మల మాట్లాడారు.
ఖమ్మం జిల్లాలో10 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని తుమ్మల తెలిపారు. అందుకోసం సీతారామా ప్రాజెక్టును నిర్మించడానికి ఏకంగా రూ.13,000 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలో కేసీఆర్ తప్ప మరొకరు లేరన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి పక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కరువు పీడిత ప్రాంతమైన పాలేరులో కేసీఆర్..‘తుమ్మల.. మీ ప్రాంతంలో ఇంకా కరువు ఉంది కదా.. తిరుమలాయ పాలెంకు ఏం చేద్దాం?’ అని అడిగారన్నారు. అప్పుడు భక్తరామదాసు ప్రాజెక్టుకు రూపకల్పన చేశామన్నారు. దీని కారణంగానే ఈ రోజు పాలేరు నుంచి కరువు పారిపోయిందని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసమే కేసీఆర్ తనను మంత్రివర్గంలోకి తీసుకున్నారని చెప్పారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాల అమలులో ఖమ్మం అగ్రస్థానంలో ఉందన్నారు. ఒకే ఏడాది 6 జాతీయ రహదారులను నిర్మించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. సత్తుపల్లి ప్రాంతంలో పామాయిల్ పంట మద్దతుధరను టన్నుకు రూ.6 వేల నుంచి ఏకంగా రూ.10,000కు కేసీఆర్ ఒక్క సంతకంతో పెంచారని ప్రశంసించారు.