Telangana: బండ్ల గణేశ్ కు కీలక పదవి అప్పగించిన కాంగ్రెస్ పార్టీ!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-bce2ac304e0fb90a2d2ff7b3ad09ea79144c3c59.jpg)
- టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియామకం
- ట్విట్టర్ లో వెల్లడించిన నిర్మాత బీఏ రాజు
- రాజేంద్ర నగర్ టికెట్ ఆశించి భంగపడ్డ గణేశ్
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే సీటును బండ్ల గణేశ్ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే మహాకూటమి నేపథ్యంలో సీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ మొండిచెయ్యి చూపింది. దీంతో గణేశ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ బండ్ల గణేశ్ కు శుభవార్త తెలిపింది.
ఆయన్ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రముఖ నిర్మాత బీఏ రాజు ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘బండ్ల గణేశ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గణేశ్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-6b69d30c6c8548456d373c05a679e3de79b60972.jpg)