big boss-2 winner: ఛాన్స్ ఇస్తామని చాలామంది మోసం చేశారు.. సొంత టాలెంట్ తోనే ఈ స్థాయికి చేరుకున్నా!: బిగ్ బాస్ విజేత కౌశల్
- ఆంధ్రాలో పుట్టినా తెలంగాణలో ఆదరించారు
- కౌశల్ ఫౌండేషన్ తో అభిమానులకు ఉపాధి కల్పిస్తా
- అభాగ్యులకు ఉచిత వైద్యం అందిస్తాను
తాను ఆంధ్రాలో పుట్టినప్పటికీ తెలంగాణ ప్రజలు సొంత బిడ్డలా ఆదరించి ఆశీర్వదించారని బిగ్ బాస్-2 విజేత కౌశల్ తెలిపాడు.1998లో తాను హైదరాబాద్ కు వచ్చాక చిన్నచిన్న ఫ్యాన్సీ షోలు చేస్తూ బతికేవాడినని తెలిపాడు. బిగ్ బాస్-2లో విజేతగా నిలిచాకే తనకు అభిమానులు పెరిగారన్నారు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ పెట్టి తన అభిమానుల్ని ఆదుకుంటాననీ, అందరికీ ఉపాధి కల్పిస్తానని పేర్కొన్నాడు.
సినిమాల్లో అవకాశం ఇస్తామని తనను చాలామంది నిర్మాతలు మోసం చేశారని కౌశల్ తెలిపాడు. ఆ తర్వాత సొంత ప్రతిభతో 6 నెలల్లోనే నిలదొక్కుకుని ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పాడు. తన తల్లి కేన్సర్ మహమ్మారితో చనిపోయిందనీ, ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న అభాగ్యులను కౌశల్ ఫౌండేషన్ ద్వారా ఆదుకుంటానని అన్నాడు. తాను ఇప్పటివరకూ 82 సినిమాల్లో నటించానని కౌశల్ చెప్పుకొచ్చాడు.