hyderabad balanagar: పనిచేస్తున్న ఇంటికే కన్నం... ప్లాన్ ఫెయిలై చోరీ చేసిన డబ్బుతో చిక్కిన వైనం
- రూ.75 లక్షలు దొంగిలించి టెర్రస్‌పై దాచిన కారు డ్రైవర్
- ఇంటి యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
- తమదైన పద్ధతిలో విచారించగా బయటపడిన నిజం
వందలు, వేలు జీతంతో అవసరాలన్నీ ఎప్పటికి తీరుతాయని అనుకున్నాడో ఏమో... ఏకంగా పనిచేస్తున్న ఇంటిలోనే కన్నం వేశాడో కారు డ్రైవర్. యజమాని కప్ బోర్డులో దాచిన రూ.75 లక్షలు చోరీ చేశాడు. ప్లాన్ ఫెయిలై కటకటాలు లెక్కిస్తున్నాడు. హైదరాబాద్‌లోని బాలానగర్ జోన్ డీసీపీ పి.వి.పద్మజ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.
నగరానికి చెందిన జాల బాపురెడ్డి వృత్తిరీత్యా వైద్యుడు. కొంపల్లిలోని మికాస స్టెర్లింగ్ విల్లా-13లో భార్య లక్ష్మితో కలిసి నివాసం ఉంటున్నారు. వీరివద్ద నిజామాబాద్ జిల్లా గౌతంనగర్‌కు చెందిన మన్నె రవికుమార్ (33) నాలుగేళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బాపురెడ్డికి నిజామాబాద్‌లో క్లినిక్ ఉంది. దీంతో బాపురెడ్డి దంపతులు సోమవారం నుంచి శుక్రవారం వరకు నిజామాబాద్‌లోనే ఉండి శని, ఆదివారాలు మాత్రమే విల్లాకు వస్తుంటారు.
ఈనెల 16న విల్లాకు వచ్చిన దంపతులు సిద్ధిపేట సమీపంలోని కొత్తూరు వద్ద ఓ స్థలం విక్రయించగా వచ్చిన రూ.75 లక్షలు తమతో పాటు తీసుకువచ్చారు. ఆ నగదు మొత్తాన్ని బ్రీఫ్ కేస్‌లో పెట్టి ఇంట్లోని కప్ బోర్డులో ఉంచారు. అనంతరం లక్ష్మి సమీపంలోని మరో విల్లాలో జరిగే ఫంక్షన్‌కు వెళ్లారు. బాపురెడ్డి ఆల్వాల్‌లో బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారు.
యజమానిని కారులో దింపి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని అవకాశంగా భావించాడు రవికుమార్. వారు తెచ్చిన డబ్బు కొట్టేయాలన్న ఉద్దేశంతో కిటికీలోంచి ఇంట్లోకి ప్రవేశించాడు. కప్ బోర్డులో రూ.75 లక్షలతో ఉన్న బ్రీఫ్ కేస్‌ను తీసుకుని టెర్రస్‌పైకి వెళ్లాడు. అక్కడ ఓ మూలన పెట్టి నీటి ట్యాంకు కవర్‌తో కప్పేశాడు. ఏమీ తెలియనట్టు వచ్చేశాడు.
శనివారం డబ్బు మిస్సయిన విషయాన్ని గమనించిన బాపురెడ్డి దంపతులు చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డ్రైవర్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. నగదు స్వాధీనం చేసుకుని రవికుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.