Hyderabad: నేడు హైదరాబాద్ కు భారీ వర్ష సూచన!
- ఈశాన్య రుతుపవనాలకు తోడైన ఉపరితల ద్రోణి
- ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులకు అవకాశం
- తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన
నేడు తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈశాన్య రుతుపవనాలకు తోడు గజ ప్రభావం, చత్తీస్ గఢ్ మీదుగా ఆవరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురవనున్నాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని హెచ్చరించింది. కాగా, గడచిన 24 గంటల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. 'గజ' తుపాను తిరిగి బలపడుతోందని అధికారులు వెల్లడించడంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని పలు జిల్లాల కలెక్టర్లకు ఏపీ సర్కారు ఆదేశాలు ఇచ్చింది.