Police: కొత్తగూడెంలో భూమిలో రూ. 40 కోట్లు పాతిపెట్టారంటూ ఫోన్ కాల్.. పోలీసుల ఉరుకులు, పరుగులు!
- టీఆర్ఎస్ కార్యకర్త పాతిపెట్టాడు
- తాను చూశానంటూ పోలీసులకు ఫోన్
- ఎంత తవ్వినా బయటపడని చిల్లిగవ్వ
- ఫేక్ కాల్ అని తేల్చిన పోలీసులు
తెలంగాణలో ఎన్నికలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండగా, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. పోలీసులు సైతం ఎక్కడికక్కడ తనిఖీలు జరుపుతూ, కోట్ల రూపాయల నగదును పట్టుకుంటున్న వేళ, కొత్తగూడెం నియోజకవర్గంలో వచ్చిన ఓ ఫోన్ కాల్ వారిని పరుగులు పెట్టించింది. ఇక్కడి పాటిరెడ్డి గూడెం గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త ఓ కారు షెడ్ వద్ద రూ. 40 కోట్లను పాతిపెట్టడాన్ని తాను చూశానని ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి ఐటీ అధికారులతో సహా వెళ్లి, ఎక్స్ కవేటర్ ను తెచ్చి మరీ తవ్వకాలు జరిపించారు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా తెలియడంతో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎంత తవ్వినా చిల్లిగవ్వ కూడా బయటపడక పోవడం గమనార్హం. ఇది పోలీసులను తప్పుదారి పట్టించేందుకు చేసిన ఫేక్ కాల్ అని అధికారులు తెలిపారు. ఈ కాల్ ఎవరు చేశారన్న విషయమై విచారిస్తున్నట్టు తెలిపారు.