Marri shashidhar Reddy: కాంగ్రెస్‌లో చేరకుండానే టికెట్ దక్కించుకున్న ఆర్.కృష్ణయ్య.. అధిష్ఠానానికి షాక్ ఇవ్వనున్న మర్రి శశిధర్ రెడ్డి!
- పార్టీలో చేరని కృష్ణయ్యకు టికెట్‌పై విస్మయం
- శశిధర్ రెడ్డికి బిగ్ షాక్
- స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న మర్రి
బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు కాంగ్రెస్ తుదిజాబితాలో చోటు దక్కడంపై ఇటు కాంగ్రెస్, అటు మహాకూటమి నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చేరకుండానే ఆయనకు మిర్యాలగూడ టికెట్ కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మిర్యాలగూడ టికెట్‌ను తన బంధువుకు ఇప్పించుకునేందుకు సీనియర్ నేత జానారెడ్డి విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆశావహులకు మొండిచెయ్యి చూపిన అధిష్ఠానం పార్టీలో చేరని వారికి టికెట్ ఇవ్వడమేంటని నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, దేవరకద్ర టికెట్‌ను తమవారికి ఇప్పించుకునేందుకు సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, డీకే అరుణ చివరి వరకు ప్రయత్నించారు. చివరికి అరుణ అనుచరుడైన పాబన్ కుమార్ రెడ్డికే టికెట్ దక్కింది.
ఇక, సనత్‌నగర్ టికెట్‌ను టీడీపీకి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మర్రి శశిధర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయి సనత్‌నగర్ టికెట్ తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినప్పటికీ అధిష్ఠానం ఆయనకు మొండిచెయ్యి చూపించింది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సనత్‌నగర్ టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ టికెట్‌ను టీడీపీకి కేటాయిస్తే తనకు అభ్యంతరం లేదని చెప్పారు. ఒకవేళ సనత్‌నగర్ టికెట్ తనకు రాకుంటే స్వతంత్రంగానైనా బరిలోకి దిగుతానని అధిష్ఠానాన్ని హెచ్చరించారు. అయితే, పార్టీని మాత్రం వీడబోనని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి కూడా తప్పుకోబోనన్నారు.