hitler: హిట్లర్, నెపోలియన్ వంటి వారిని నేను అనుసరిస్తా: పాక్ ప్రధాని ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
- నాడు యుద్ధాలప్పుడు వారు యూటర్న్ తీసుకోలేదు
- ధైర్యంగా ముందుకెళ్లారు
- నష్టపోయినా వెన్నుచూపకూడదు
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిట్లర్, నెపోలియన్ వంటి వారిని తాను అనుసరిస్తానని అన్నారు. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. నాడు రష్యాతో యుద్ధాలు జరిగినప్పుడు వారు ‘యూటర్న్’ తీసుకుని ఉంటే నష్టాలు తగ్గేవని, కానీ, ధైర్యంగా వారు ఎదురెళ్లారని, నష్టపోయినప్పటికీ అలాంటి పరిస్థితులకు వెన్నుచూపకూడదని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. క్లిష్ట సమయాల్లో నిర్ణయాలు తీసుకోలేని వాళ్లు మంచి నాయకులు కాలేరని అన్నారు.
కాగా, ఇమ్రాన్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ లోని ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సీనియర్ నేత సయ్యద్ ఖుర్షిద్ స్పందిస్తూ, తాను హిట్లర్ లాంటి వ్యక్తినని స్వయంగా ఇమ్రానే ప్రకటించుకున్నారని అన్నారు. హిట్లర్ లాగే ప్రజల పట్ల ఇమ్రాన్ కూడా నియంతలా వ్యవహరిస్తారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ నేత ఖవాలా మహమ్మద్ మాట్లాడుతూ, ఇప్పుడు, హిట్లర్, నెపోలియన్ ల గురించిన ప్రస్తావన ఎందుకు? అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో చరిత్రను కించపరచొద్దంటూ హితవు పలికారు.