Chiranjeevi: చిరంజీవి, అల్లు అరవింద్ లనే గెలిపించుకోలేని నువ్వు.. 2014లో మమ్మల్ని గెలిపించావా?: పవన్ పై మంత్రి కళా వెంకట్రావు విసుర్లు!
- పవన్ ఏనాడూ నిజాయతీతో పనిచేయలేదు
- జగన్ ను రహస్యంగా కలిసి 40 సీట్లు కోరారు
- బహిరంగ లేఖలో విమర్శలు గుప్పించిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏనాడూ నిజాయతీ, నిబద్ధతతో పనిచేయలేదని ఏపీ మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులకు నమ్మకద్రోహం చేసిన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాకు పవన్ వంతపాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యువత, బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం చంద్రబాబుపై పవన్ విమర్శలు గుప్పించడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కళా వెంకట్రావు ఈ రోజు పవన్ కల్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు.
బీజేపీ హిందుత్వ పార్టీ కాదని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని లేఖలో మంత్రి తప్పుపట్టారు. ఏపీకి రూ.75,000 కోట్లు రావాలన్న నిజనిర్ధారణ కమిటీ నివేదికపై పవన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. అప్పటి ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో పాటు అల్లు అరవింద్ ను ఎన్నికల్లో గెలిపించుకోలేని పవన్ కల్యాణ్ 2014లో టీడీపీని ఏ రకంగా గెలిపించారని ప్రశ్నించారు. విశాఖపట్నంలో యలమంచిలి రవి ఇంట్లో జగన్ తో పవన్ కల్యాణ్ రహస్యంగా సమావేశం అయ్యారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో 40 సీట్లు కావాలని జగన్ ను కోరిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జనసేన పోరాటయాత్ర పేరుతో ఏసీ బోగీల్లో కూర్చున్న పవన్ సామాన్యులను ఎలా కలవగలిగారో చెప్పాలన్నారు.
బాక్సైట్ సహా ఇతర గనులకు మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అనుమతులు వచ్చాయని తెలిసినా పవన్ మౌనం వహించారని విమర్శించారు. ప్రసంగాల్లో పరుష పదజాలం వాడుతూ యువతకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, సీబీఐతో వేధింపులు, ఐటీ దాడులపై పవన్ స్పందించాలని డిమాండ్ చేశారు.