Sabarimala: ఇరుముడితో శబరిమలకు వచ్చిన బీజేపీ నేత సురేంద్రన్... అరెస్ట్ చేసిన పోలీసులు!
- అయ్యప్ప దర్శనానికి వచ్చిన సురేంద్రన్
- ముందు జాగ్రత్త చర్యగా అరెస్ట్
- నీలక్కల్ ప్రాంతంలో ఉద్రిక్తత
శబరిమలకు వెళ్లి, అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలన్న కేరళ బీజేపీ జనరల్ సెక్రెటరీ కే సురేంద్రన్ ను, అతనితో పాటు వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తలపై ఇరుముడితో వచ్చిన ఆయన్ను పంబకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆపేసిన పోలీసులు, సురేంద్రన్ ను శబరిమలకు పంపితే, ఆయన తిరిగి రాకపోవచ్చని, అక్కడే ఉండి, నిరసనలకు దిగవచ్చన్న అభిప్రాయంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగానే సురేంద్రన్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నీలక్కల్ బేస్ క్యాంపు వద్ద ఆయన్ను అరెస్ట్ చేసి, వెనక్కు పంపించామని, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ అధికారి వెల్లడించారు.
తన అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన ఆయన, అయ్యప్ప భక్తులను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. భక్తులను అరెస్ట్ చేయడం నిరంకుశమని, తమపై లాఠీచార్జ్ చేసినా స్వామి వద్దకు వెళ్లకుండా ఆపలేరని, తమపై కాల్పులు జరిపి హతమార్చడం ఒక్కటే తమను ఆపుతుందని అన్నారు. "స్వామియే అయ్యప్ప" అని నినదిస్తూ, ఆయన ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి, హిందూ ఐక్య వేదిక అధ్యక్షుడు కేపీ శశికళను కూడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు తరువాత శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూడో మారు తెరచిన సంగతి తెలిసిందే.