Uttar Pradesh: ప్రభుత్వ అధికారుల నిర్వాకం.. భర్త ఉండగానే భార్యకు వితంతు పెన్షన్ మంజూరు!
- యూపీలోని సీతాపూర్ జిల్లాలో ఘటన
- సందీప్ భార్యకు పెన్షన్ ఇచ్చిన అధికారులు
- విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. భర్తలు బతికుండగానే భార్యలకు వితంతు పెన్షన్లు మంజూరు చేసి తమ నిర్వాకాన్ని చాటుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. యూపీకి చెందిన సందీప్ కుమార్ భార్య బ్యాంకు ఖాతాలోకి ఇటీవల రూ.3,000 డిపాజిట్ అయ్యాయి.
దీనికి సంబంధించిన మెసేజ్ సందీప్ ఫోన్ కు వచ్చింది. ఈ మొత్తాన్ని ఎవరు డిపాజిట్ చేశారో తెలుసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన సందీప్ కు అధికారులు చిన్నపాటి షాక్ ఇచ్చారు. ‘ఆమెకు వితంతు పెన్షన్ కింద ఈ మొత్తం డిపాజిట్ అయింది’ అని చెప్పడంతో సందీప్ బిత్తరపోయాడు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. తన భార్యకే కాకుండా అత్త, మరదలికి సైతం వితంతు పెన్షన్లను అధికారులు మంజూరు చేశారని వాపోయారు.
ఈ వ్యవహారం మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ ఘటనపై సీతాపూర్ జిల్లా కలెక్టర్ శితల్ వర్మ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు గల కారణమేంటో ఇంకా తమకు తెలియరాలేదనీ, విచారణ పూర్తయ్యాక దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.