Andhra Pradesh: దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేరుస్తా.. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తా!: సీఎం చంద్రబాబు
- క్రైస్తవ సోదరుల సమస్యలను పరిష్కరిస్తాం
- జెరూసలేం యాత్రకు నిధులను కేటాయిస్తాం
- ట్విట్టర్ లో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
క్రైస్తవ సోదరులు ఇచ్చే సూచనలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో క్రైస్తవ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను వచ్చే క్రిస్మస్ నాటికల్లా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం జెరూసలేంకు వెళ్లేందుకు వీలుగా నిధుల కేటాయింపును పెంచుతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్విట్టర్ లో స్పందించారు.
అలాగే ఏపీలోని దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ రోజు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ’క్రిస్టియన్ సోదరుల సూచనలు ఎప్పుడూ శిరోధార్యమే. ఆత్మీయ సమ్మేళనంలో వారు ప్రస్తావించిన సమస్యలను చర్చించి వచ్చే క్రిస్మస్ పండుగ నాటికి పరిష్కరిస్తాను. జెరూసలెం వెళ్లేందుకు నిధులు అధికం చేస్తాను. దళిత క్రిస్టియన్లను ఎస్సీలలో చేర్చే విషయమై కేంద్రంపై ఒత్తిడి చేస్తాను’ అని ట్వీట్ చేశారు.