Rahul Gandhi: ప్లేసు.. టైము మీరే చెప్పండి.. దమ్ముంటే 15 నిమిషాలు నాతో చర్చకు రండి.. మోదీకి సవాలు విసిరిన రాహుల్ గాంధీ
- నేను అడిగే ప్రశ్నలకు మోదీ వద్ద సమాధానం లేదు
- దమ్ముంటే నాతో చర్చకు రమ్మనండి
- నోట్ల రద్దుతో లాభపడింది ఆయన వ్యాపార స్నేహితులే
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్రమోదీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి మరో సవాలు విసిరారు. రాఫెల్ డీల్‌పై తనతో 15 నిమిషాలపాటు చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఈ కుంభకోణంలో తన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు.
‘‘రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం గురించి ఎక్కడైనా, ఎప్పుడైనా ఓ 15 నిమిషాలు నాతో చర్చకు రావాల్సిందిగా మోదీని సవాలు చేస్తున్నా. అనిల్ అంబానీ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటనలు, యుద్ధ విమానాల ధర గురించి మాట్లాడతా. ఈ మొత్తం కథంతా ప్రధానే నడిపించారని రక్షణ మంత్రి చెప్పిన విషయం గురించి మాట్లాడతా. నియమ నిబంధనలను ప్రధాని పాటించలేదు. సీబీఐ డైరెక్టర్‌ను అర్ధరాత్రి దాటాక ఎందుకు తొలగించారు? ఈ ప్రశ్నలన్నింటికీ మోదీ వద్ద సమాధానం లేదు’’ అని రాహుల్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో మోదీ ‘బిజినెస్‌మెన్ ఫ్రెండ్స్’ లాభపడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు.