MeToo India: అంతా అయిపోయింది... నా కెరీర్ ఇక ముగిసింది!: గాయని చిన్మయి
- 'మీటూ'పై గళమెత్తిన చిన్మయి
- డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగింపు
- '96' త్రిషకు చెప్పిన డబ్బింగే చివరిదన్న చిన్మయి
ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు ఎంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని చెప్పి, దక్షిణాది 'మీటూ' ఉద్యమానికి కేంద్రంగా మారి, వార్తల్లో నిలిచిన చిన్మయి, ఇక తన కెరీర్ ముగిసిందని చెప్పింది. తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి ఆమె సభ్యత్వాన్ని తొలగించారట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన ఆమె, ఈ రెండేళ్లూ తన డబ్బింగ్ ఫీజు నుంచి 10 శాతం మొత్తాన్ని అసోసియేషన్ ఎందుకు తీసుకుందని ప్రశ్నించింది. తనపై వేటు కొనసాగితే, ఇటీవలి '96' చిత్రంలో త్రిషకు తాను చెప్పిన డబ్బింగ్ చివరిదని ట్వీట్ చేసింది. ఇక తన కెరీర్ ముగిసినట్టేనని వ్యాఖ్యానించింది.
'మీటూ'పై మాట్లాడినందుకు ఇలా జరిగిందని చెప్పింది. కాగా, చిన్మయి పెట్టిన ట్వీట్లను పలువురు సమర్థించగా, కొందరు విమర్శించారు. తనను విమర్శిస్తున్న వారి ట్వీట్లపైనా చిన్మయి స్పందిస్తోంది. కాగా, గతంలోనే తన కెరీర్ పై చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డబ్బింగ్ యూనియన్ నాయకుడిగా ఉన్న రాజాపై ట్వీట్ చేస్తూ, అతను కూడా ఎంతోమందిని అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేశాడని ఆరోపించింది. గతనెల 9న ఆమె ట్వీట్ చేస్తూ, "త్వరలో నా డబ్బింగ్ కెరీర్ నాశనం అవుతుంది. అతను డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు" అని చెప్పింది.