Telangana: కాంగ్రెస్ తరఫున 165, టీఆర్ఎస్ తరఫున 156 నామినేషన్లు... దడపుట్టిస్తున్న రెబల్స్!
- రేపటితో ముగియనున్న నామినేషన్ గడువు
- అత్యధిక రెబల్స్ కాంగ్రెస్ లోనే
- టీఆర్ఎస్, టీడీపీలకు కూడా బెడద
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు మరో 36 గంటల్లో ముగియనుంది. ఇవాళ ఆదివారం కావడంతో నామినేషన్లను స్వీకరించరు. ఇక మిగిలింది సోమవారం ఒక్కరోజే. కాగా, ప్రధాన పార్టీల్లో రెబెల్స్ బెడద చాలా అధికంగా ఉండటం, ఆయా పార్టీల అభ్యర్థుల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ఇప్పటివరకూ కాంగ్రెస్ తరఫున అత్యధికంగా 165 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్ తరఫున 156 నామినేషన్లు పడ్డాయి. నియోజకవర్గాల సంఖ్యకన్నా, నామినేషన్ల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. టీఆర్ఎస్ తో పోలిస్తే, కాంగ్రెస్ లో రెబల్స్ బెడద అధికంగా ఉంది. టికెట్లు దక్కని పలువురు బరిలోకి దిగారు.
ఇక రెబల్స్ బెడద బీజేపీలోనూ ఉంది. బీజేపీ తరఫున ఇప్పటివరకూ 142 నామినేషన్లు దాఖలయ్యాయి. బహుజన సమాజ్ పార్టీ తరఫున 70 నామినేషన్లు దాఖలయ్యాయి. సీపీఎం తరఫున 36, తెలుగుదేశం తరఫున 32 నామినేషన్లు పడ్డాయి. ఈ రెండు పార్టీలూ అధికారికంగా పోటీ చేస్తున్న స్థానాల సంఖ్యను పరిశీలిస్తే, ఈ పార్టీలకు కూడా రెబల్స్ బెడద అధికంగానే ఉంది. ఇక ఇతర పార్టీల తరఫున, స్వతంత్రులుగా సుమారు 870 మంది నామినేషన్లు వేశారు. రెబల్స్ గా బరిలోకి దిగిన వారిని బుజ్జగించేందుకు మరో మూడు రోజుల గడువు వుండటంతో, వారి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూసేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు.