Banoth Vijaya: నామినేషన్ల పర్వంలో భాగంగా సీపీఐలో భగ్గుమన్న వర్గ విభేదాలు
- సీపీఐ అభ్యర్థిగా బానోతు విజయ
- నామినేషన్ వేసేందుకు సిద్ధమైన లాల్‌సింగ్
- అడ్డుకున్న హేమంతరావు అనుచరులు
- ఇరు వర్గాల మధ్య ఘర్షణ
నామినేషన్ల పర్వంలో భాగంగా ఖమ్మం జిల్లా వైరాలో సీపీఐ నేతల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. పొత్తుల్లో భాగంగా వైరా సీటును సీపీఐకి కేటాయించారు. దీంతో తమ అభ్యర్థిగా బానోతు విజయను సీపీఐ బరిలోకి దింపింది. అక్కడి సీటును ఆశించి భంగపడిన బానోతు లాల్ సింగ్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు నేడు సిద్ధమయ్యారు.
ఆయన్ను సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎలాగోలా తప్పించుకున్న లాల్‌సింగ్ ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కూడా ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎట్టకేలకు లాల్‌సింగ్ నామినేషన్ దాఖలు చేశారు.