Chandrababu: లచ్చయ్యపేట ఫ్యాక్టరీని చంద్రబాబు శనక్కాయలకు, బెల్లానికి అమ్మేశారని రైతులు చెబుతున్నారు: జగన్
- రైతులమంతా నాశనమై పోయాము
- నేడు మా పరిస్థితిని పట్టించుకునే పరిస్థితి లేదు
- ఎలా బతుకుతామని రైతులు అడుగుతున్నారంటున్న జగన్
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం షుగర్స్‌కు చెందిన లచ్చయ్యపేట ఫ్యాక్టరీని చంద్రబాబుగారు శనక్కాయలకు, బెల్లానికి అమ్మేశారని రైతులు తనకు తెలిపారని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన తర్వాత విజయనగరం జిల్లా పార్వతీపురంలో తొలిసారి బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘పార్వతీపురంలో అడ్డారు ఆనకట్టను నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. ఎన్నికల ముందు గుర్తొచ్చింది కానీ ఎన్నిలై పోయాక పట్టించుకునే నాథుడే లేడు.
ఇదే పార్వతీపురం రైతులు చంద్రబాబు కారణంగా చెరకు రైతులమంతా నాశనమై పోయామని చెబుతున్నారు. ‘గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం షుగర్స్‌కు చెందిన లచ్చయ్యపేట ఫ్యాక్టరీని చంద్రబాబుగారు శనక్కాయలకు, బెల్లానికి ఎన్‌సీఎస్ అనే ప్రైవేటు కంపెనీకి అమ్మేశారన్నా.. నేడు మా పరిస్థితిని పట్టించుకునే పరిస్థితి లేదన్నా.. ఇదే ఎన్‌సీఎస్ చెరకు బకాయిల విషయంలో గత ఏడాదికి సంబంధించి రూ.12 కోట్లు బాకీ ఉన్నారంటే మేము ఏం తినగలుగుతాం? ఎలా బతకగలుగుతాం’ అని రైతులు పేర్కొన్నా పట్టించుకునే నాథుడు లేడు’’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.