Telangana: హుజూర్ నగర్ లో నామినేషన్ వేసిన ఉత్తమ్.. కాంగ్రెస్ లో చేరాలని శంకరమ్మకు ఆహ్వానం!
- టీఆర్ఎస్ లో సామాన్యులకు చోటులేదు
- బంగారు తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యం
- హస్తం నేతలకు తలనొప్పిగా టీజేఎస్ వ్యవహారం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. హుజూర్ నగర్ నుంచి పోటీచేస్తున్న ఉత్తమ్ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లో సామాన్యులకు చోటు లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
సామాజిక, బంగారు తెలంగాణ అన్నది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 94 చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. వీటిలో ఆరు సీట్లు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. అలాగే 25 సీట్లను కాంగ్రెస్ తన మిత్రపక్షాలకు కేటాయించింది. అయితే మరిన్ని స్థానాలు కావాలని కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితి ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతోంది.