Andhra Pradesh: చంద్రబాబు వందలకొద్దీ రహస్య జీవోలు ఇచ్చారు.. కానీ ‘సీబీఐ’ జీవోపై మాత్రం కుల మీడియాకే లీకు ఇచ్చారు!: విజయసాయిరెడ్డి
- దీని వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?
- ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు
- దానికి కూడా బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం వందలకొద్దీ రహస్య ప్రభుత్వ ఉత్తర్వులు(జీవో) జారీచేసిందని ఆరోపించారు. వీటిలో చాలా జీవోలను సమాచార హక్కు చట్టానికి దొరక్కుండా దాచిపెట్టారని విమర్శించారు. ఫేస్ బుక్ లో ఈ రోజు టీడీపీ ప్రభుత్వంపై విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వందలాది జీవోలను దాచిపెట్టిన చంద్రబాబు.. సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్వర్వుల రద్దు జీవోను మాత్రం సొంత ‘కుల’ మీడియాకు లీక్ చేశారని ఆరోపించారు. ఈ లీకేజీల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారాన్ని మేనేజ్ చేసేవాళ్లు లేక, మరేదారి కనిపించకే లీక్ చేయాల్సి వచ్చిందా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యవహారశైలిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నెల్లూరులోని శ్రీహరికోటలో ఇటీవల జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారని విజయసాయిరెడ్డి అన్నారు. అయితే ఈ ఘటనతో చంద్రబాబు అలిగి కూర్చున్నారన్నారు. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ లో ఉండగా తనను అభినందించకుండా శాస్త్రవేత్తలను పొగడటం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వెటకారమాడారు. శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం ఏర్పాటు చేయాలని విద్యార్థి దశలో 1961లోనే బాబు సూచించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.