Chhath celebrations: ఓటర్లకు డబ్బులు పంచిపెడుతూ దొరికిన ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే.. సంప్రదాయాన్ని పాటించానంటూ వివరణ!

  • మరోసారి వివాదాస్పదమైన గణేశ్ జోషి వ్యవహారం
  • మద్యం పంచితే ఎవరూ అడగడం లేదని ఆక్రోశం
  • గతంలో పోలీసు గుర్రం చావుకు కారణమైన ఎమ్మెల్యే

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని  వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. త్వరలో పురపాలక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు డబ్బులు పంచుతూ కెమేరాకు దొరికిపోయారు. అయితే, ఈ విషయంలో ఆయన తనను తాను సమర్థించుకున్నారు. తరాల నాటి సంప్రదాయాన్ని తాను పాటిస్తున్నానని, చాత్ పూజ సందర్భంగా మహిళలకు బహుమానాలు అందించానని చెప్పుకొచ్చారు. చాత్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గణేశ్ జోషి వంద రూపాయల నోట్లు పంచుతున్న వీడియో వెలుగులోకి వచ్చి వివాదాస్పదమైంది.

ఈ వీడియోపై స్పందించిన గణేశ్ జోషి మాట్లాడుతూ.. తాను మహిళలకు మాత్రమే డబ్బులు పంచానని, చాత్ పూజ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇవ్వడం సంప్రదాయమని, దానినే తాను పాటించానని వివరణ ఇచ్చారు. నుదిటిపై ‘టికా’ వేసుకున్న మహిళలకు మాత్రమే డబ్బులు పంచానని, వేరేవారికి ఇవ్వలేదని వివరించారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఓటర్లకు డబ్బులు పంచినందుకు ఎన్నికల అధికారుల నుంచి నోటీసు రాలేదా? అన్న ప్రశ్నకు జోషి స్పందిస్తూ తనకు ఎటువంటి నోటీసు అందలేదన్నారు. ఒకవేళ నోటీసు వస్తే తప్పకుండా సమాధానం ఇస్తానన్నారు. ఓటర్లకు మద్యం పంచితే ఎవరూ పట్టించుకోవడం లేదని, తాను సనాతన సంప్రదాయాన్ని పాటిస్తే మాత్రం ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గణేశ్ జోషికి వివాదాలు కొత్తకాదు. 2016లో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో పోలీసు గుర్రం ‘శక్తిమాన్’పై దాడి చేసి దాని చావుకు కారణమయ్యారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.

Chhath celebrations
Chhattisgarh
Ganesh joshi
distributing money
BJP
  • Loading...

More Telugu News