Jammu And Kashmir: అఫ్రిది యూ టర్న్.. భారత మీడియాపై ఆగ్రహం!
- మనకు కశ్మీర్ ఎందుకన్న అఫ్రిది
- పాక్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత
- కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌దేనన్న మాజీ క్రికెటర్
కశ్మీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి పాక్ ప్రజల ఆగ్రహానికి గురైన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది రెండు రోజులకే నాలిక మడతేశాడు. 'అబ్బే.. తానలా అనలేదంటూ' మాట మార్చాడు. అదంతా భారత మీడియా సృష్టేనంటూ తనకు అలవాటైన వ్యాఖ్యలు చేశాడు. రెండు రోజుల క్రితం అఫ్రిది ఓ సందర్బంలో మాట్లాడుతూ.. ఉన్న నాలుగు ప్రావిన్స్‌లనే సరిగా పాలించడం చేతకావడం లేదని, అలాంటి మనకు కశ్మీర్ అవసరమా? అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఉన్న నాలుగు ప్రావిన్స్‌లను పాలించడానికే పాక్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. అలాంటి మనకు కశ్మీర్ ఎందుకు? అలాగని దానిని భారత్‌కు కూడా ఇవ్వొద్దు. స్వతంత్రంగా ఉంచేద్దాం. కశ్మీర్ ప్రజలు మరణిస్తుండడం ఎంతో బాధాకరం’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, తమ దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అఫ్రిది వెనక్కి తగ్గాడు.
తాజాగా మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలను భారత మీడియా వక్రీకరించిందని ఆరోపించాడు. తన దేశమంటే తనకెంతో ఇష్టమన్నాడు. స్వాతంత్ర్యం కోసం కశ్మీరీలు చేస్తున్న పోరాటానికి విలువ ఉందన్నాడు. అలాగే, కశ్మీర్ ఇంకా భారత దురాక్రమణలోనే ఉందని తనకు అలవాటైన ఆరోపణలు చేశాడు. కశ్మీర్ వివాదం పరిష్కారం కావాల్సి ఉందన్నాడు. కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌దేనని, తనతో సహా పాక్ ప్రజలందరూ కశ్మీర్ స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు ఇస్తారని స్ఫష్టం చేశాడు.