Andhra Pradesh: చిన్నారి చేతిపై పెన్సిల్ తో గుచ్చిన సైకో టీచర్.. ఆపరేషన్ చేయాలంటున్న వైద్యులు!

  • అనంతపురంలోని సాయినగర్ లో ఘటన
  • కేశవరెడ్డి పాఠశాలలో టీచర్ రాక్షసత్వం
  • ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ రాక్షసురాలిగా మారింది. హోంవర్క్ చేయలేదన్న కోపంతో విద్యార్థి చేతిపై పెన్సిల్ తో పొడిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈ రోజు చోటుచేసుకుంది.

అనంతపురంలోని సాయినగర్ లో ఉంటున్న కేశవరెడ్డి పాఠశాలలో హరిచరణ్ తేజ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. టీచర్ ఇచ్చిన హోంవర్క్ ను చేయకుండా తేజ్ ఈ రోజు క్లాస్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా హోంవర్క్ లను పరిశీలించిన టీచర్ ఆగ్రహంతో ఊగిపోయింది. ‘హోంవర్క్ ఇస్తే చేయకుండా స్కూలుకు వస్తావా?’ అంటూ పెన్సిల్ తో చేతిపై గట్టిగా పొడిచింది. ఈ ఘటనలో పెన్సిల్ ఓవైపు నుంచి చేతిలోకి దూసుకెళ్లి మరోవైపు నుంచి బయటకు వచ్చింది.

దీంతో బాలుడిని స్థానికంగా ఉన్న ప్రియా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై వైద్యులు మాట్లాడుతూ.. బాలుడి కుడి చేతికి లోతుగా గాయమయిందని తెలిపారు. చేతిలో గుచ్చుకున్న రెండు పెన్సిల్ ముక్కలను ఇప్పటికే తొలగించామన్నారు. ఈ చేతికి మరోసారి ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు తేజ్ గాయపడటానికి కారణమైన టీచర్ పై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు స్కూలు ముందు ఆందోళనకు దిగాయి.

Andhra Pradesh
Anantapur District
psyco teacher
wound
pencil attack
  • Loading...

More Telugu News