sabarimala: శబరిమలలో చిక్కుకున్న 40 మంది తెలుగువాళ్లు.. అన్నం, నీళ్లు దొరక్క తీవ్ర ఇక్కట్లు!
- రేపు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం
- 144 సెక్షన్ విధించిన కేరళ ప్రభుత్వం
- నీలక్కల్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
మండల పూజల నేపథ్యంలో శబరిమలలో అయ్యప్ప ఆలయాన్ని రేపటి నుంచి తెరవనున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆలయంలోకి వెళ్లేందుకు 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న కొందరు మహిళలు సిద్ధం అవుతుండగా, వీరిని అడ్డుకునేందుకు ఆందోళనకారులు తయారయ్యారు. దీంతో పోలీసులు ఆలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 40 మంది భక్తులు నీలక్కల్ లో చిక్కుకున్నారు.
ఈ సందర్భంగా ఏపీకి చెందిన ఓ భక్తుడు మాట్లాడుతూ.. సన్నిధానానికి వెళ్లే మార్గంలోనే బస్సులను పోలీసులు నిలిపివేశారని తెలిపారు. దాదాపు 40 మంది తెలుగువారు ఇక్కడ చిక్కుకున్నారని చెప్పారు. రేపు మధ్యాహ్నం దాకా తమను అనుమతించబోమని అధికారులు చెబుతున్నారని వాపోయారు. తాము ఎలాంటి ఆహారం, నీళ్లను వెంట తెచ్చుకోలేదన్నారు. బస్సులు ఆగిపోయిన ప్రాంతంలో ఆహారం, మంచినీటి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి బాగోలేదనీ, భక్తులెవరూ ఇప్పుడే రావొద్దని సూచించారు