red snadle: ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘా... స్మగ్లర్ సాహుల్ భాయ్‌ని రప్పిస్తాం: కర్నూల్ రేంజ్ డీఐజీ
- కర్నూల్ రేంజ్ డీఐజీ నాగేంద్రకుమార్
- ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక నిఘా అని వెల్లడి
- అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టీకరణ
అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ సాహుల్ భాయ్‌ని కడపకు రప్పిస్తామని కర్నూల్ రేంజ్ డీఐజీ నాగేంద్రకుమార్ తెలిపారు. డీఐజీగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఆయన కడప జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమావేశమై జిల్లాలో శాంతిభత్రలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నేరాలను అదుపు చేయడమేకాక, నేరస్తులను కట్టడి చేస్తామని చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు.
జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టిందని, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పోలీసులు నిత్యం పర్యటించాలని సూచించారు. అవసరమైన గ్రామాల్లో రాత్రి నిద్ర చేసి గ్రామస్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. జూదం, కోడిపందాలు, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు. దొంగతనాలు, చోరీలను అదుపు చేసేందుకు అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు అమర్చనున్నట్లు తెలిపారు.