Andhra Pradesh: టీడీపీ నేత పంచాయితీ.. కాలర్ పట్టుకుని లాకప్ లో వేసిన పోలీసులు!
- తూర్పుగోదావరి జిల్లా కోరింగలో ఘటన
- ఆందోళనకు దిగిన టీడీపీ నేతలు
- ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన ఎస్పీ విశాల్
తూర్పుగోదావరి జిల్లా కోరింగలో టెన్షన్ టెన్షన్ పరిస్థితి నెలకొంది. అధికార టీడీపీ నేతలకు కోరింగ ఎస్సై సుమంత్, ఏఎస్సై సుబ్బారావుకు మధ్య మొదలైన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. దీంతో ఇద్దరు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
జిల్లాలోని పి.మల్లవరం మండలం పత్తిగొందిలో దున్నా కిరణ్, కుంచే నాగబాబు, గుత్తుల సాయికుమార్ అనే వ్యక్తులు తన ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డారని దున్నా రమేశ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రమేశ్ కు రూ.12,000 చెల్లించేలా పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మొత్తాన్ని నిందితులు పోలీసులకు అప్పగించారు. అయితే వీరిని విడిచిపెట్టకుండా బెయిల్ కోసం ఆధార్, ఓటర్ కార్డులు తీసుకురావాలని పోలీసులు షరతు పెట్టారు.
ఈ విషయాన్ని నిందితుల కుటుంబ సభ్యులు టీడీపీ మండల అధ్యక్షుడు దున్నా సత్యనారాయణకు ఫోన్ చేసి చెప్పారు. ఆయన వెంటనే స్టేషన్ కు వచ్చి.. ‘ఇంతకుముందే రాజీపడ్డాం కదా, ఇప్పుడు కేసు ఏంటి?’ అని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన ఎస్సై సుమంత్, ఏఎస్సై సుబ్బారావులు సత్యనారాయణను కాలర్ పట్టుకుని లాకప్ లో పడేశారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు 216వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇద్దరు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని టీడీపీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విషయమై విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ.. ఎస్సై, ఏఎస్సైలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.