Andhra Pradesh: సైకోగా మారిన టెక్కీ భర్త.. కట్నం తేవాలంటూ భార్యకు వేధింపులు, మామకు బూతు సందేశాలు!
- అబద్ధం చెప్పి యువతితో పెళ్లి
- నిజం తెలుసుకుని ప్రశ్నించిన యువతి
- కటకటాల వెనక్కు నెట్టిన పోలీసులు
ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నానంటూ యువతిని పెళ్లాడాడు. మూడు ముళ్లు పడ్డాక తన అసలు బుద్ధిని బయటపెట్టాడు. మరింత కట్నం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టాడు. ఇది తట్టుకోలేని బాధితురాలు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది. అయినప్పటికీ బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు అసభ్య సందేశాలు పంపుతూ వేధించాడు. చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని నాగోలులో చోటుచేసుకుంది.
వైజాగ్ కు చెందిన బీరం సంజయ్ బెంగళూరులోని కేఆర్ పురంలో ఉంటున్నాడు. తాను కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేస్తున్నానని నమ్మించి గతేడాది మే నెలలో ఓ యువతిని సంజయ్ పెళ్లి చేసుకున్నాడు. యువతి చేస్తున్న ఉద్యోగాన్ని మాన్పించాడు. ఈ నేపథ్యంలో సంజయ్ కాగ్నిజెంట్ లో పనిచేయడం లేదని తెలుసుకున్న యువతి అతడిని నిలదీసింది. అప్పటినుంచి ఆమెను సంజయ్ తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. పుట్టింటి నుంచి మరింత కట్నం తీసుకురావాలని నరకం చూపించాడు.
దీంతో యువతి అక్కడి నుంచి పరారై పుట్టింటికి వచ్చేసింది. దీంతో తన భార్యను కాపురానికి పంపాలని పిటిషన్ ను దాఖలు చేశాడు. అయితే ఇందుకు బాధితురాలు నిరాకరించడంతో యువతితో పాటు ఆమె తండ్రి ఫోన్లకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు తన తండ్రితో కలిసి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.