Drunk Driving: మద్యం తాగి వాహనం నడిపిన మహిళకు నాలుగు రోజుల జైలు శిక్ష
- మరో 42 మందికి మూడు నుంచి పది రోజులు...
- కూకట్‌పల్లి తొమ్మిదో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పు
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జైలు
మద్యం తాగి వాహనం నడపడమేకాక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ మహిళకు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని తొమ్మిదో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, మద్యం సేవించి వాహనం నడపడం, లైసెన్స్, ఇతర కాగితాలు లేకపోవడం వంటి కారణాలతో మొత్తం 97 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదుచేసి కోర్టు ముందుంచారు.
వీరంతా బాలానగర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో చిక్కారు. ఈ కేసులు పరిశీలించిన న్యాయమూర్తి వీరిలో మద్యం తాగి వాహనం నడిపిన వారికి మూడు రోజుల నుంచి పది రోజుల వరకు శిక్ష విధించారు.
అలాగే, లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వారికి నాలుగు రోజులు, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడుపుతున్న వారికి నాలుగు రోజులు జైలుతోపాటు రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి దుర్గాప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు.