Gaja: భీకర గాలులతో తీరం దాటిన 'గజ'.. తమిళనాడులో భారీ వర్షాలు!
- అర్ధరాత్రి తీరం దాటిన పెను తుపాను
- 7 జిల్లాల్లో కుండపోత వర్షాలు
- రంగంలోకి దిగిన నేవీ, ఎన్డీఆర్ఎఫ్
- పలు రైళ్ల రద్దు, మరికొన్ని దారిమళ్లింపు
- దక్షిణ కోస్తాంధ్రలోనూ వర్షాలు
గడచిన వారం రోజులుగా తమిళనాడు రాష్ట్రాన్ని వణికించిన 'గజ' తుపాను గత అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో తీరం దాటింది. నాగపట్నం, వేదారణ్యం మధ్య తుపాను తీరం దాటగా, ఆ సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 7 జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తూ ఉండగా, ఇతర జిల్లాలు, కేరళలోని పలు ప్రాంతాలతో పాటు, ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కాగా, వాతావరణ శాఖ హెచ్చరికలతో తమిళనాడు సర్కారు ముందస్తు చర్యలు చేపట్టడంతో, ఇప్పటివరకూ ప్రాణనష్టం సంభవించలేదు. మొత్తం 3,500 మంది సహాయక సిబ్బందిని రంగంలోకి దించిన యంత్రాంగం, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే 331 పునరావాస శిబిరాలకు తరలించింది. మొత్తం 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. కడలూరు, నాగపట్నం, తిరువాయూరు, రామనాథపురంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 7 జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు, రేపు కూడా సెలవు ప్రకటించినట్టు అధికారులు తెలియజేశారు.
కాగా, తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. రహదారులపై భారీ వృక్షాలు నేలరాలగా, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది. హెలికాప్టర్లలో బాధితులకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్టుగార్డు బృందాలు రంగంలోకి దిగాయి. సముద్రపు అలల ఉద్ధృతి అధికంగా ఉండటంతో, ప్రముఖ బీచ్ ల వద్దకు వెళ్లడాన్ని ప్రభుత్వం నిషేధించింది.
నాగపట్నం, తిరువూరు, తంజావూరు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొన్ని రైళ్లను దారిమళ్లించినట్టు తెలిపింది. తీరం వెంబడి సహాయక చర్యల కోసం 8 నౌకలు, 2 డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ లను మోహరించామని ఐసీజే తెలిపింది. ఐఎన్ఎస్ రణ్ వీర్, కంజార్ యుద్ధ నౌకలు సముద్రంలో సిద్ధంగా ఉన్నాయని తూర్పు నౌకాదళం అధికారి ఒకరు తెలిపారు. తుపాను బాధితులను సకాలంలో గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.