KCR: గెలవకుంటే ప్రజలకు మళ్లీ ముఖం చూపించను.. రాజకీయ సన్యాసం పక్కా: కేటీఆర్
- టీఆర్ఎస్ పాలనకు ఇది రెఫరెండమే
- సీఎం పదవిపై వ్యామోహం లేదు
- మహిళా మంత్రులు ఎందుకు లేరంటే అసహనం
త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ప్రజలకు మళ్లీ తన ముఖం చూపించనని టీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. టీఆర్ఎస్ గెలవబోతుందని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నట్టు పేర్కొన్నారు. ప్రతీ సర్వేలోనూ టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే తేలిందన్నారు. బీజేపీకి వందకుపైగా స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామన్నారు. ఈ ఎన్నికలు నాలుగేళ్ల మూడు నెలల టీఆర్ఎస్ పాలనకు రిఫరెండమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ జరుగుతున్న ప్రచారంపైనా కేటీఆర్ స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. తనకు మంత్రి పదవే ఎక్కువన్నారు. కేసీఆర్ మరో 15 ఏళ్లు సీఎంగా ఉంటారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కేబినెట్లో మహిళా మంత్రులు ఎందుకు లేరన్న ప్రశ్నకు కేటీఆర్ ఒకింత అసహనం ప్రదర్శించారు. కేబినెట్ కూర్పు అన్నాక బోల్డన్ని సమీకరణాలు ఉంటాయని, వాటి ప్రకారమే మంత్రివర్గం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, భవిష్యత్తులో మాత్రం తప్పకుండా తమ మంత్రివర్గంలో మహిళలు ఉంటారని పేర్కొన్నారు.