choppadandi constituency: దళిత బిడ్డనని చిన్నచూపా... కేసీఆర్ కి ఎన్నికల్లో నా సత్తా చూపిస్తా!: బొడిగె శోభ

- కేసీఆర్ నన్ను బలవంతంగా పార్టీ నుంచి బయటకు పంపారు
- ఆయన కుటుంబ పాలనపై పోరాడుతాను
- బీజేపీ కండువా కప్పుకోనున్న శోభ
‘దళిత బిడ్డనని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను చిన్నచూపు చూశారు. బలవంతంగా పార్టీ నుంచి బయటకు గెంటేశారు. నేనేంటో, నా సత్తా ఏంటో ఎన్నికల్లో ఆయనకు తెలియజేస్తాను' అని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సవాల్ విసిరారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు అధిష్ఠానం టికెట్ నిరాకరించడంతో ఆమె ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో గురువారం శోభ కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్లో ఉద్యమకారులకు ప్రాధాన్యం లేదని, అక్కడంతా అగ్రవర్ణాలదే రాజ్యమని విమర్శించారు. టీఆర్ఎస్లో కుటుంబ పాలన సాగుతోందని, దీనిపై తాను యుద్ధం చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.