Telangana: 14 సీట్లతోనే సర్దుకున్న కారణమిదే: చంద్రబాబు
- టికెట్ల పంపకాల్లో నేతల అసంతృప్తి
- బలాబలాలు, స్థితిగతులను పరిశీలించానన్న చంద్రబాబు
- గెలిచే చోట్ల మాత్రమే పోటీ చేస్తున్నామని స్పష్టం
2014లో జరిగిన ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలిచుండి కూడా, ఈ ఎన్నికల్లో అంతకు మించిన సీట్ల కోసం పట్టుబట్టి కనీసం 25 నుంచి 30 సీట్లలో పోటీ చేసే అవకాశాలున్నా, 14 స్థానాలకే పరిమితమైన కారణాన్ని చంద్రబాబు వివరించారు. ఈ ఉదయం కొందరు తెలంగాణ టీడీపీ నేతలు టికెట్ల పంపకాల విషయంలో అసంతృప్తితో ఉండి, చంద్రబాబును కలువగా, కచ్చితంగా గెలుస్తామన్న స్థానాలను మాత్రమే తెలుగుదేశం పార్టీ కోరిందని ఆయన స్పష్టం చేశారు.
ఇతర చోట్ల టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ఉన్నప్పటికీ, మహాకూటమిలోని మిగతా పార్టీ నేతల బలాబలాలు, స్థితిగతులను పరిశీలించిన మీదటే, ఆయా స్థానాలను టీడీపీకి ఇవ్వాలని డిమాండ్ చేయలేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్నామని గుర్తు చేసిన ఆయన, నేతలెవరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ భవిష్యత్తులో సముచితమైన గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చారు. అధికారాన్ని సాధిస్తే, ఎమ్మెల్సీలుగా ఐదారుగురికి అవకాశాలు లభిస్తాయని గుర్తు చేశారు.