Chandrababu: విశాఖలో నేటి నుంచి ఎడ్యూ టెక్‌ సదస్సు...హాజరవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

  • బీచ్‌ రోడ్డులోని నోవాటెల్‌ హోటల్‌ వేదికగా మూడురోజుల నిర్వహణ
  • మధ్యాహ్నం చోడవరంలో సుజల స్రవంతి పథకానికి శంకుస్థాపన
  • అక్కడి బహిరంగ సభలో మాట్లాడనున్న సీఎం

డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానం విద్యారంగంలో అమలు, నూతన ఆవిష్కరణల లక్ష్యంగా నిర్వహిస్తున్న ఎడ్యూ టెక్‌ సదస్సు నేడు విశాఖ నగరంలో జరగనుంది.  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదస్సును ప్రారంభించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యునెస్కో, ఢిల్లీలోని మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ సస్టైనబుల్‌ డెవలెప్‌మెంట్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. బీచ్‌ రోడ్డులోని నోవాటెల్‌ హోటల్‌లో జరగనున్న సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 57 దేశాలకు చెందిన ప్రతినిధులు, విద్యావేత్తలు, మానసిక, న్యూరో నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు దాదాపు 1200 మంది హాజరవుతున్నారు.

 ఉదయం జరిగే సదస్సుకు హాజరవుతున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం జిల్లాలోని చోడవరం వెళ్తారు. అక్కడ 2.50 గంటలకు బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉత్తరాంధ్ర పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జల్లాల్లో 46 మండలాల్లోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1037 గ్రామాలకు తాగునీరు సదుపాయం కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఇందుకోసం గోదావరి జలాల మళ్లింపు ఈ పథకంలో కీలకం. ఈ బృహత్తర ప్రాజెక్టుకు శంకుస్థాపన అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News