ahmdabad: మతిస్థిమితం లేని మహిళ కడుపులో కిలోన్నర వస్తువులు
- గాజులు, మేకులు, మంగళ సూత్రాలు, హెయిర్ పిన్నులు ఇలా..
- ఆపరేషన్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయిన వైనం
- అక్యుఫాగియా అనే వ్యాధితో బాధపడుతున్న మహిళ
మతిస్థిమితం లేని ఓ మహిళ కడుపులో కిలోన్నర బరువున్న ఇనుము, బంగారం, రాగి వస్తువులు ఉండడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో దాదాపు పాతిక ముప్పయి రకాల వస్తువులు కనిపించడంతో కంగుతిన్నారు. అహ్మదాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..
షిర్డీ నగరానికి చెందిన సంగీత (40) ‘ఆక్యుఫాగియా’ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈమె తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు నగరంలోని మెంటల్ ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. పరిశీలించిన వైద్యులు కడుపులో కిలోన్నర వస్తువులు ఉన్నాయని గుర్తించారు. ఆపరేషన్ చేశాక ఆమె కడుపులో కనిపించిన వస్తువులు చూసి ఆశ్చర్యపోయారు.
మెడలోని మంగళ సూత్రంతోపాటు చేతి గాజులు, ఇనుప మేకులు, నట్లు, బోల్టులు, సేఫ్టీ పిన్నులు, హెయిర్ పిన్నులు, బ్రాస్‌లెట్‌లు, చైన్లు, రాగి ఉంగరం కనిపించాయి. దాదాపు కిలోన్నర బరువున్న ఈ వస్తువులను వెలికి తీశారు. ‘ఆక్యుఫాగియా’ అనే వ్యాధితో బాధపడే వారికి ఇనుప వస్తువులు తినాలని ఉంటుందట. ఈ కారణంగానే సంగీత వాటిని మింగేసి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.