shashi tharoor: ఒక చాయ్ వాలా ప్రధాని కావడానికి నెహ్రూనే కారణం: శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
- ఏ వ్యక్తి అయినా అత్యున్నత స్థానానికి చేరుకునేలా వ్యవస్థలను తీర్చిదిద్దింది నెహ్రూనే
- మంగళయాన్ గురించి కేంద్రం గొప్పగా చెప్పుకుంటోంది... ఇస్రోను స్థాపించింది ఎవరు?
- ఓ పద్ధతి ప్రకారం నెహ్రూపై అపనిందలను మోపుతున్నారు
ఇటీవలి కాలంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం శివలింగంపై ఉన్న తేలుతో మోదీని శశిథరూర్ పోల్చడం, పెద్ద వివాదాన్నే రాజేసింది. తాజాగా, మరోసారి ప్రధానిపై ఆయన విరుచుకుపడ్డారు. ఓ చాయ్ వాలా దేశానికి ప్రధాని కాగలిగారంటే... దానికి కారణం మాజీ ప్రధాని నెహ్రూనే అని అన్నారు.
తాను రచించిన 'నెహ్రూ: ది ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియా' పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఏ వ్యక్తి అయినా అత్యున్నత స్థానానికి చేరుకునే విధంగా వ్యవస్థలను నెహ్రూ తీర్చి దిద్దారని థరూర్ చెప్పారు. అంతులేని అబద్ధాలతో నెహ్రూకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగిస్తోందని ఈ సందర్భంగా శశిథరూర్ మండిపడ్డారు.
దేశ ప్రథమ ప్రధానిపై ఓ పద్ధతి ప్రకారం అపనిందలను మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భరతమాత గొప్ప పుత్రుల్లో ఒకరైన నెహ్రూను కావాలని కించపరుస్తున్నారని... ఇలా ఎందుకు చేస్తున్నారని? ప్రశ్నించారు. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం మంగళయాన్ గురించి గొప్పగా చెప్పుకుంటోందని... ఈ ఘనతను సాధించిన ఇస్రోను స్థాపించింది ఎవరని థరూర్ అడిగారు. పేద దేశమైన ఇండియా ఆకాశాన్ని లక్ష్యం చేసుకోవాలనే ధైర్యం చేసిందెవరని ప్రశ్నించారు. సిలికాన్ వ్యాలీకి 40 శాతం మంది నిపుణులను పంపిస్తున్న ఐఐటీలను స్థాపించిందెవరని అన్నారు.
ఈ కార్యక్రమానికి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నెహ్రూ మనకు అందించిన అతిగొప్ప వారసత్వాన్ని... ప్రస్తుత ప్రభుత్వం నిరంతరం అణగదొక్కేందుకు యత్నిస్తోందని విమర్శించారు. నవభారతాన్ని నెహ్రూ నిర్మించిన తీరును ప్రస్తుత ప్రభుత్వం తప్పుబడుతోందని... దేశాన్ని అధ్వానమైన దిశగా తీసుకెళుతోందని మండిపడ్డారు.