Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టింగ్స్ పెట్టిన యువకుడి అరెస్టు
- నిందితుడు చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన నవీన్‌కుమార్ రాజు
- ఈనెల 8న సీఎం బెంగళూరు పర్యటన సందర్భంగా ప్లకార్డుల ప్రదర్శన
- పాజిటివ్ కామెంట్స్‌ను నెగెటివ్‌గా మార్పింగ్ చేసి పోస్టింగ్స్
ముఖ్యమంత్రి చంద్రబాబు బెంగళూరు పర్యటన సందర్భంగా అక్కడి నేతలు, కార్యకర్తలు పట్టుకున్న ప్లకార్డులలోని అనుకూల వ్యాఖ్యలను (పాజిటివ్ కామెంట్లు), వ్యతిరేకమైనవిగా (నెగెటివ్) మార్ఫింగ్ చేసి, అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్టింగ్ చేసిన యువకుడిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ వై.టి.నాయుడు అందించిన వివరాలు..
బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే చర్యల్లో భాగంగా సీఎం ఈనెల 8న బెంగళూరు వెళ్లారు. అక్కడి టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాబుకు ఘన స్వాగతం పలుకుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్లకార్డుల్లో ‘సింబల్ ఆఫ్ యూనిటీ’, ‘యూ ఆర్ ది హోప్ వీ రెలి ఆన్’ అనే నినాదాలు రాశారు. అయితే ‘సింబల్ ఆఫ్ యూనిటీని...సింబల్ ఆఫ్ షేమ్‌గా, యూ ఆర్ ది హోప్ వీ రెలి ఆన్‌ను.. వీ ఫీల్ అషేమ్డ్’గా మార్పింగ్ చేశారు. అనంతరం 'బెంగళూరులో చంద్రబాబుకు ఘోర అవమానం' అంటూ వ్యాఖ్యానాలు జోడించి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేశారు.
దీనిపై టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి కనకమేడల వీరాంజనేయులు ఈనెల 10న అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు అర్బన్ ఎస్పీ సిహెచ్.విజయరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు నిర్వహించి ఈ పోస్టింగ్స్ చేసింది చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన కుమార్‌రాజు నవీన్‌కుమార్ రాజుతో పాటు మరికొందరుగా గుర్తించారు. ఇతను కడప జిల్లా రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నట్లు తెలుసుకున్నారు.
దీంతో నవీన్‌కుమార్ రాజును అరెస్టు చేసి అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరు నిందితులను గుర్తించాల్సి ఉందని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని వై.టి.నాయుడు తెలిపారు.