Andhra Pradesh: ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం ఆయనతోనే పోయింది.. ఇప్పుడున్నది చంద్రబాబు హైబ్రిడ్ తెలుగుదేశమే!: సి.రామచంద్రయ్య

  • చంద్రబాబు దయ్యాలను ప్రోత్సహిస్తున్నారు
  • ఆయన తల్లి కాంగ్రెస్ తో చేతులు కలిపారు
  • పాపాల నుంచి కాపాడాల్సిన కర్మ మాకు పట్టలేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో దయ్యాల్లాంటి నేతలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య విమర్శించారు. అలాంటి వ్యక్తిని నిలువరించేందుకే తాను ఈ రోజు వైఎస్ జగన్ తో చేతులు కలిపినట్లు వెల్లడించారు. ఏపీలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఎగురుతున్నారని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో జగన్ సమక్షంలో ఈ రోజు వైసీపీలో చేరిన అనంతరం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు.

23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన చంద్రబాబు గవర్నర్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పక్కా అవకాశవాదని విమర్శించారు. చంద్రబాబు చేసిన పాపాల నుంచి రక్షించాల్సిన కర్మ తమకు పట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పొత్తుపై కనీసం తమను సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ తెలుగుదేశం ఎన్టీఆర్ తోనే పోయిందనీ, ఇప్పుడు మిగిలింది హైబ్రిడ్ తెలుగుదేశం పార్టీయేనని వెల్లడించారు. వైసీపీని 'పిల్ల కాంగ్రెస్' అంటూ విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు ఏకంగా 'తల్లి కాంగ్రెస్'తోనే చేతులు కలిపారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అమాయకుడనీ, అందుకే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా చాలామంది బయటకు వస్తారని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Congress
Jagan
YSRCP
C.RAMACHANDRAIAH
  • Loading...

More Telugu News