Petrol: ఎన్నికల ఎఫెక్ట్?... నేడూ తగ్గిన పెట్రోలు ధర!

  • లీటరు పెట్రోలుపై 13 పైసల తగ్గింపు
  • 12 పైసలు తగ్గిన డీజిల్ ధర
  • క్రూడాయిల్ ధర పెరిగినా కనిపించని ప్రభావం

పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల నేడు కూడా కొనసాగింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, దాదాపు మూడు వారాలకు పైగా నిత్యమూ ధరలు తగ్గుతుండగా, మంగళవారం నాడు లీటరు పెట్రోలుపై 13 పైసలు, డీజిల్ పై 12 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 77.43కు తగ్గగా, డీజిల్ ధర రూ. 72.19కి చేరింది. ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర రూ. 82.94కు, డీజిల్ ధర రూ. 75.64కు చేరుకుంది.

ఆమధ్య కర్ణాటక ఎన్నికల సమయంలో మూడు వారాల పాటు పెట్రోలు, డీజిల్ ధరలు మారకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి వెళ్లాయి. ఆపై అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారంలో చమురు ఉత్పత్తిని 10 లక్షల బ్యారళ్లు కుదిస్తున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించగా, ఆ వెంటనే క్రూడాయిల్ పై ఒత్తిడి పెరిగి, ధరలు తిరిగి పెరగడం ప్రారంభమైంది. ఇండియాపై మాత్రం ఆ ప్రభావం ఇంకా కనిపించడం లేదు.

  • Loading...

More Telugu News