Andhra Pradesh: వైసీపీలో చేరిన సి.రామచంద్రయ్య.. ఆలింగనం చేసుకుని పార్టీలోకి ఆహ్వానించిన జగన్!
- పార్వతీపురంలో పార్టీలో చేరిన నేత
- కండువా కప్పి ఆహ్వానించిన జగన్
- పదవులపై ఇంకా రాని స్పష్టత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ఈ రోజు వైసీపీలో చేరారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ ఆయన కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో రామచంద్రయ్య జనసేనలో చేరే అవకాశముందని పలువురు భావించారు. అయితే ఇందుకు భిన్నంగా రామచంద్రయ్య ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పార్టీ అధినేత జగన్ రామచంద్రయ్యకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రామచంద్రయ్యతో పాటు ఆయన అనుచరులు వైసీపీలో చేరారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన రామచంద్రయ్య బ్యాంకులో చార్టెట్ అకౌంటెంట్ (సీఏ)గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించిన రామచంద్రయ్య.. 1985లో కాంగ్రెస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత కాలక్రమంలో టీడీపీలో చేరిన రామచంద్రయ్యకు చంద్రబాబు పొలిట్ బ్యూరో సభ్యుడి హోదాను కట్టబెట్టారు. తదనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆయన 2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. దేవాదాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా వైసీపీలో చేరితే ఇచ్చే పదవుల విషయమై జగన్ రామచంద్రయ్యకు ఏం హామీ ఇచ్చారో ఇంకా తెలియరాలేదు.