Maharashtra: విద్యార్థిని చావగొట్టిన టీచర్.. పక్షవాతంతో ఆసుపత్రి పాలైన బాలుడు!
- మహారాష్ట్రలోని పుణేలో ఘటన
- హోంవర్క్ చేయలేదని టీచర్ రాక్షసత్వం
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఇటీవలి కాలంలో చిన్నారుల పట్ల టీచర్లు అమానవీయంగా ప్రవర్తిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ విద్యార్థి హోంవర్క్ చేయలేదని తెలుసుకున్న టీచర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన శక్తినంతా ఉపయోగించి బాలుడి చెంపపై బలంగా కొట్టాడు. దీంతో సదరు విద్యార్థి పక్షవాతానికి గురయ్యాడు. మహారాష్ట్రలోని పుణేలో గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పుణె జిల్లా ఇందాపూర్ ప్రాంతానికి చెందిన బాలుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రిపరేటరీ మిలటరీ స్కూల్లో ఆరో తరగతి చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో డ్రాయింగ్ హోంవర్క్ పూర్తిచేయకపోవడంతో ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. చెంపపై గట్టిగా చాచికొట్టాడు. అక్కడితో అతని కోపం చల్లారకపోవడంతో కింద పడిపోయిన చిన్నారిని లేపి తలను బెంచీకేసి గట్టిగా కొట్టాడు. దీంతో చిన్నారి ముఖం ఉబ్బిపోయింది. టీచర్ మరోసారి కొడతాడన్న భయంతో బాలుడు విషయాన్ని ప్రిన్సిపాల్ కు చెప్పలేదు.
దీపావళి పండుగ సందర్భంగా కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు స్కూలుకు వచ్చిన తల్లిదండ్రులు తమ కుమారుడి పరిస్థితి చూసి షాక్ కు లోనయ్యారు. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. దెబ్బలు బలంగా తగలడంతో బాలుడి ముఖానికి పక్షవాతం వచ్చిందని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనలో సదరు టీచర్ ను సస్పెండ్ చేసినట్లు స్కూలు ప్రిన్సిపాల్ తెలిపారు.