Ramachandrababu: సినీ, టీవీ నటుడు రామచంద్రబాబు అరెస్ట్.. బెయిల్ మంజూరు!
- 2009లో కేసు నమోదు చేసిన సీసీఎస్
- అప్పట్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్
- గడువు తీరిన తరువాత పొడిగించుకోని రామచంద్రబాబు
- అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
చక్రవాకం, రుతురాగాలు వంటి పలు సీరియల్స్, అనేక సినిమాల్లో నటించిన ఎ.రామచంద్రబాబును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్ల క్రితం వేరొకరి స్థలంపై బోగస్ పత్రాలను సృష్టించి, భాగస్వామ్యమంటూ రూ. 60 లక్షలు కాజేయడంతో పాటు, మరో రూ. 50 లక్షలకు మోసం చేశారన్న ఆరోపణలపై ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్ట్ నుంచి తప్పించుకున్న ఆయన, దాన్ని పొడిగించుకోవడంలో విఫలం అయ్యాడు. దీంతో నిన్న సీసీఎస్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
రామచంద్రబాబుపై ఉన్న కేసు వివరాల్లోకి వెళితే, ఖాదర్ భాషా అనే వ్యక్తికి బంజారాహిల్స్ లో 3 ఎకరాల 21 గుంటల స్థలం ఉంది. దీనికి రూ. 20 లక్షలు ఇస్తానంటూ వచ్చిన రామచంద్రబాబు, కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నాడు. ఆపై స్థలం తనదేనని, సంతోష్ నగర్ కు చెందిన శ్రీనివాస్ ను సంప్రదించి, రూ. 60 లక్షలు ఇస్తే విభేదాలు పరిష్కరించుకుంటానని, 25 శాతం స్థలాన్ని ఇస్తానని చెప్పాడు. వీరిద్దరి మధ్యా కర్నూలు జిల్లాకు చెందిన ఓ పొలిటికల్ లీడర్ మధ్యవర్తిత్వం జరిపాడు. ఆపై టీవీ సీరియల్స్ తీస్తానంటూ శ్రీనివాస్ వద్ద మరో రూ. 50 లక్షలు అప్పు తీసుకున్నాడు.
డబ్బు కోసం శ్రీనివాస్ ఒత్తిడి పెంచడంతో పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి, ఆపై తన చెక్కులు పోయాయంటూ డబీర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కంగుతిన్న శ్రీనివాస్, స్థలం విషయమై ఖాదర్ భాషాను సంప్రదించి, తాను మోసపోయినట్టు గ్రహించి, పోలీసులను ఆశ్రయించాడు. 2009లో ఈ కేసు నమోదైంది. దీంతో అధికారులు రామచంద్రబాబు కోసం గాలిస్తుండగా, హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు.
దీని గడువు గత నెలలో ముగిసింది. కోర్టును ఆశ్రయించి, దీన్ని పొడిగించుకోవాల్సిన రామచంద్రబాబు ఆ పని చేయలేదు. దీంతో అరెస్ట్ తప్పలేదు. కాగా, కోర్టుకు వచ్చిన రామచంద్రబాబు తదఫు న్యాయవాది సాంకేతిక తప్పిదం కారణంగా ముందస్తు బెయిల్ ను పొడిగించుకోలేక పోయామని చెప్పడంతో, అతనికి మరోసారి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.