vasundhara raje: రాజస్థాన్‌లో బీజేపీ ప్రయోగాల బాట.. 25 మంది సిట్టింగులకు షాక్
- 131 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
- 21 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి
- 12 మంది మహిళలకు చోటు
రాజస్థాన్‌లో బీజేపీ ప్రయోగాల బాటన సాగుతోంది. సర్వేలన్నీ అధికార బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకుంది. 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాకిచ్చింది. తొలి జాబితాలో వారి పేర్లను పక్కనపెట్టి వారి స్థానంలో యువకులకు చోటిచ్చింది. తొలి జాబితా చూసి కంగుతిన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. 85 మంది సిట్టింగులకు అవకాశం ఇచ్చిన బీజేపీ 25 మందిని మాత్రం తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా 131 మంది అభ్యర్థుల జాబితాను తొలి విడతలో బీజేపీ ప్రకటించింది. ముఖ్యమంత్రి వసుంధర రాజే ఎప్పుడూ పోటీ చేసే ఝల్రాపతన్ నుంచే పోటీలో ఉన్నారు. అలాగే, సిట్టింగ్ ఎంపీ అయిన సోనారామ్ చౌదరి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. బీజేపీ విడుదల చేసిన తొలి విడత జాబితాలో 12 మంది మహిళలు, 19 మంది ఎస్టీలు, 17 మంది ఎస్సీలు ఉన్నారు.