t-congress: ఢిల్లీలో రాహుల్ తో ముగిసిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం
- టీ-కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై చర్చ
- పలు సూచనలు చేసిన రాహుల్ గాంధీ
- ఈ జాబితాకు తుదిరూపు ఇచ్చేందుకు కసరత్తు
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ జాబితాపై చర్చించే నిమిత్తం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా తదితరులు కలిశారు.
ఈ మేరకు రాహుల్ పలు సూచనలు చేసినట్టు సమాచారం. ఈ జాబితాకు తుదిరూపు ఇచ్చేలా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో సొంత పార్టీకి చెందిన అభ్యర్థులు ఎంత మంది ఉన్నారు? ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన వారు ఎంతమంది ఉన్నారనే విషయమై రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం.
కాగా, రాహుల్ ని కలిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ నివాసానికి స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు తదితరులు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ అభ్యర్థుల జాబితాపై చర్చించినట్టు సమాచారం.