Central Minister: అమెరికాలో చికిత్స పొందినా లాభం లేకపోయింది... అనంత్ కుమార్ ప్రాణం తీసిన కేన్సర్!
- న్యూయార్క్ లోని కేన్సర్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స
- గత నెలలోనే తిరిగొచ్చిన అనంత్ కుమార్
- పరిస్థితి విషమించి కన్నుమూత
- సంతాపం తెలిపిన నరసింహన్, కుమారస్వామి
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్ కుమార్ ను ఊపిరితిత్తుల కేన్సర్ కబళించింది. వ్యాధికి చికిత్స నిమిత్తం ఆయన అమెరికాకు వెళ్లి వచ్చినా ఫలితం దక్కలేదు. న్యూయార్క్ లోని కేన్సర్ ఇనిస్టిట్యూట్ లో చికిత్సపొంది, గత నెల ఇండియాకు వచ్చిన ఆయన పరిస్థితి మరింతగా విషమించింది. ఆయన్ను బెంగళూరులోని శ్రీ శంకర ఆసుపత్రికి తరలించారు. అక్కడాయనకు వెంటిలేటర్ ను అమర్చిన వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు శ్రమించారు.
కేన్సర్ విషమించి ఈ తెల్లవారుజామున 2 గంటలకు ఆయన మరణించగా, ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని బెంగళూరు నేషనల్ కాలేజీలో ఉంచనున్నారు. మొత్తం ఆరుసార్లు లోక్ సభకు ఎన్నికైన ఆయన పలు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తన సంతాపాన్ని వెలిబుచ్చారు. అనంత్ కుమార్ మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.