Undavalli: 'ఫరూక్ అనే నేను'... మంత్రిగా ప్రమాణ స్వీకారం!
- ఉండవల్లి ప్రజావేదికలో ప్రమాణ స్వీకారం
- మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్ కుమార్
- ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్
- అభినందనలు తెలిపిన చంద్రబాబు తదితరులు
కొద్దిసేపటి క్రితం ఉండవల్లి ప్రజావేదికలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరుగగా, ముస్లిం నేత ఎన్ఎండీ ఫరూక్, మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన కిడారి కుమారుడు శ్రవణ్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ వీరిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, ఫరూక్, శ్రవణ్ కుటుంబీకులు హాజరయ్యారు.
"ఎన్ మహమ్మద్ ఫరూక్ అనే నేను..." అంటూ ఫరూక్ ప్రమాణ స్వీకారం తెలుగులో సాగింది. ఆయన చివరిగా 'అల్లా' పేరును ఉచ్చరించారు. కిడారి శ్రవణ్ కుమార్ ప్రమాణ స్వీకారం మాత్రం ఇంగ్లీషులో సాగింది. కొత్తగా ఎంపికైన మంత్రులకు నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఫరూక్ కు వైద్య ఆరోగ్య శాఖతో పాటు మైనారిటీ సంక్షేమ శాఖను, శ్రవణ్ కు గిరిజన సంక్షేమ శాఖలను కేటాయించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.