AOB: పోలీసులమంటూ గిరిజనుడిని ఎత్తుకెళ్లిన వ్యక్తులు : తమకు సంబంధం లేదంటున్న పోలీసులు
- వంట చెరకు కోసం వెళితే పట్టుకు వెళ్లారు
- గ్రామస్థులు అడ్డుకుంటే హుకుంపేట స్టేషన్కు రావాలని సూచన
- తీసుకు వెళ్లిన వ్యక్తులు తమ సిబ్బంది కాదంటున్న హుకుంపేట ఎస్‌ఐ
ఓ గిరిజనుడి అదృశ్యం ఏజెన్సీలో కలకలానికి కారణమైంది. వంట చెరకు సేకరించేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లిన గిరిజనుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్థులు అడ్డుకుంటే అతన్ని ప్రశ్నించాల్సి ఉన్నందున తీసుకు వెళ్తున్నామని, హుకుంపేట పోలీస్ స్టేషన్‌కి రావాలని కోరారు. తీరా అక్కడికి వెళ్లిన గ్రామస్థులకు, పట్టుకెళ్లిన వ్యక్తులు తమ స్టేషన్ సిబ్బంది కాదని ఎస్‌ఐ చెప్పడంతో దిక్కుతోచడం లేదు.
వివరాల్లోకి వెళితే... ఏఓబీలోని కోరాపుట్ జిల్లా పాతల పంచాయతీ పనసపుట్టు గ్రామానికి చెందిన పాంగి నర్సులు, ఆయన కొడుకు, మరో వ్యక్తి కలిసి శుక్రవారం వంట చెరకు తెచ్చుకునేందుకు కొండప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొందరు పోలీసు యూనిఫాంలో తారసపడ్డారు. హుకుంపేట పోలీసులమని చెప్పి నర్సులును అదుపులోకి తీసుకున్నారు. దీంతో నర్సులుతోపాటు వెళ్లిన మరో వ్యక్తి విషయం గ్రామస్థులకు చేరవేశాడు. వారంతా అక్కడికి చేరుకుని పోలీసులను అడ్డుకున్నారు. ప్రశ్నించాల్సి ఉన్నందున తీసుకువెళ్తున్నామని, హుకుంపేట స్టేషన్‌కి రావాలని చెప్పి నర్సులును తీసుకుని వెళ్లిపోయారు.
శనివారం గ్రామస్థులంతా హుకుంపేట స్టేషన్‌కి వచ్చి ఎస్‌ఐ నాగకార్తీక్‌ను కలిశారు. ఘటనా స్థలిలో తాము తీసిన ఫొటోలను ఎస్‌ఐకి చూపించగా, పోటోలో ఉన్న వ్యక్తులెవరూ తమ స్టేషన్ సిబ్బంది కారని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. నర్సులు ఆచూకీపై ఆందోళన చెందుతున్నారు.
ఈ సంఘటనపై గిరిజన సంఘం నాయకులు కృష్ణారావు, కొండలరావు, నైని సత్తిబాలు మాట్లాడుతూ అమాయక గిరిజనులను మావోయిస్టు సానుభూతి పరులుగా చూపుతూ పోలీసులు, పోలీసు ఇన్‌ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు బలితీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.