Jagan: శ్రీనివాసరావు ఫోన్లలో ఏమీ లేదు: తేల్చిన సిట్ వర్గాలు!
- జగన్ పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు
- ఏడాదిలో 9 ఫోన్లు, 10 వేల కాల్స్
- కేసుకు ఉపయోగపడే సమాచారం లేదన్న సిట్
వైజాగ్ ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ లో చేరినప్పటి నుంచి తొమ్మిది సెల్ ఫోన్లు మార్చాడు. ఏడాదిలో 10 వేల సార్లు ఫోన్ కాల్స్ చేశాడు. 321 మందితో మాట్లాడాడు... ఇవి జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు గురించి పోలీసులు వెల్లడించిన తొలి వివరాలు. విచారణ అనంతరం ఆ సెల్ ఫోన్ సంభాషణల్లో కేసుకు తగ్గ ఆధారాలు ఏమీ లభించలేదని, తనకు రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన కనిగిరి మండలం దేవాంగనగర్ కు చెందిన ముస్లిం మహిళతో మాత్రమే వైఎస్ జగన్ పై తాను హత్యాయత్నం చేయనున్నానని చెప్పాడని పోలీసులు తేల్చారు. అంతకుమించి కాల్ లిస్టులో అనుమానించదగ్గ అంశాలేవీ లభించలేదని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
తనకు పరిచయమైన మహిళకు గొప్పలు చెప్పుకోవడం కోసమే, హత్యాయత్నం గురించి ఆమెకు ముందే చెప్పి, టీవీలో తాను వస్తానని, చూడాలని కోరాడని, అంతకుమించి ఆమెకు కూడా ఘటనతో సంబంధం లేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ తొమ్మిది ఫోన్లు కూడా అతనివి కాదని, ఎయిర్ పోర్టుకు వచ్చేవారి ఫోన్లను తీసుకుని, అందులో సిమ్ వేసుకుని మాట్లాడి, ఆపై సిమ్ తీసేసుకుని, వారి ఫోన్లను వారికి ఇచ్చేవాడని, ఈ ఫోన్లలో ఒకటి మినహా మిగతా అన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని, రెండు సిమ్ కార్డులను మాత్రమే అతను వాడాడని కోర్టుకు సమర్పించే నివేదికలో సిట్ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం.