Pakistan: న్యూజిలాండ్-పాక్ మ్యాచ్‌లో రెండు అనూహ్య ఘటనలు.. ఐసీయూకి చేరిన పాక్ బ్యాట్స్‌మన్!
- మరో ఘటనలో కివీస్ ఫీల్డర్‌కు గాయం
- రెండింటికి ఒకే బౌలర్ కారణం
- ఆందోళన చెందిన ప్రేక్షకులు
పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో రెండు అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓసారి పాక్ బ్యాట్స్‌మన్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి చేరితే మరో ఘటనలో కివీస్ ఫీల్డర్ గాయపడ్డాడు. ఫెర్గ్యూసన్ వేసిన షార్ట్‌పిచ్ బంతిని ఆడే క్రమంలో పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్ తీవ్రంగా గాయపడి మైదానంలోనే కుప్పకూలాడు. ఏం జరిగిందో తెలియక మైదానంలోని ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులు కూడా ఆందోళన చెందారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో హక్ చికిత్స పొందుతున్నాడు.
మళ్లీ ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లోనే మరో ఘటన జరిగింది. ఇన్నింగ్స్ 33వ ఓవర్లో జరిగిన ఈ ఘటన అందరినీ మరోమారు ఆందోళనకు గురిచేయడమే కాదు.. ఆశ్చర్యం కూడా కలిగించింది. ఫెర్గ్యూసన్ వేసిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన షోయబ్ మాలిక్ దానిని బలంగా బాదాడు. అది నేరుగా వెళ్లి షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నికోలస్ ఎడమ భుజానికి బలంగా తాకింది.
దీంతో అతడు బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలాడు. భుజాన్ని చేత్తో పట్టుకుని బాధగా మూలిగాడు. ఆటగాళ్లందరూ అతడి వద్దకు వచ్చి తట్టి లేపడంతో కాసేపటికి లేచాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ వెంటనే షోయబ్ మైదానాన్ని వీడడం అందరినీ ఆశ్చర్య పరిచింది. షోయబ్ ఎందుకు వెళ్లిపోయాడన్నది రీప్లే చూస్తే కానీ ఎవరికీ అర్థం కాలేదు.
నికోలస్ భుజాన్ని తాకిన బంతి అదే వేగంతో పైకి లేచింది. గాల్లోని బంతిని చూసిన సోధీ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్నాడు. దీంతో షోయబ్ అవుటయ్యాడు. అయితే, నికోలస్‌కు గాయం కావడంతో అందరూ అటువైపు దృష్టిసారించడంతో ఎవరూ అవుట్‌ను గమనించలేదు. తాను అవుటైన విషయం తెలిసిన మాలిక్ బాధతో విలవిల్లాడుతున్న నికోలస్ వద్దకు వెళ్లి పరామర్శించిన తర్వాతే మైదానాన్ని వీడడం గమనార్హం.