Congress: కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్న చిరంజీవి?

  • కుటుంబ సభ్యులతో చర్చించిన చిరంజీవి
  • గత కొంతకాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉన్న మెగాస్టార్
  • కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరం కావాలని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో చర్చించిన ఆయన, ఈ విషయంలో అతి త్వరలో ప్రకటన వెలువరించనున్నారని సమాచారం. తాను పెట్టిన ప్రజారాజ్యం  పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం, కేంద్రమంత్రిగా, ఎంపీగా కొనసాగుతూ వచ్చిన చిరంజీవి, గత కొంతకాలంగా, ఆ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా, తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై తనతో కనీసం సంప్రదింపులు చేయలేదని భావిస్తున్న చిరంజీవి, ఇక పార్టీని వీడటమే మేలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఢిల్లీలో చంద్రబాబు, రాహుల్ గాంధీ కలసి పని చేయాలని నిర్ణయించిన తరువాత అసమ్మతి జ్వాలలు మిన్నంటగా, ఆ పార్టీ సీనియర్ నేతలు వట్టి వసంత్‌ కుమార్, పసుపులేటి బాలరాజు, సీ రామచంద్రయ్యలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఏప్రిల్ 2తో చిరంజీవి రాజ్యసభ పదవీ కాలం పూర్తికాగా, అప్పట్లోనే ఆయన కాంగ్రెస్ ను వీడుతారన్న వార్తలు వచ్చాయి. 'ఖైదీ నంబర్ 150' సూపర్ హిట్టయిన తరువాత, రెట్టించిన ఉత్సాహంతో వెంటనే వరుసగా సినిమాలు చేసేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. ఈ ఎన్నికలు ముగిసే వరకూ కాంగ్రెస్ లోనే చిరంజీవి ఉంటారని భావించినప్పటికీ, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News