Bay of Bengal: 'గజ'గజలాడిస్తున్న వాయుగుండం... రేపటికి తీవ్ర తుపాను!
- బంగాళాఖాతంలో వాయుగుండం
- రేపటికి పెను తుపానుగా మారే అవకాశం
- భారీ వర్షాలకు అవకాశం ఉందన్న ఐఎండీ
బంగాళాఖాతంలో నెలకొన్న వాయుగుండం నిన్న రాత్రి తీవ్ర రూపం దాల్చగా, నేడు అది తుపానుగా మారింది. ఇక, సోమవారం నాటికి ఇది మరింతగా ఉద్ధృతమై కోస్తాంధ్రపై విరుచుకుపడనుంది. దీనికి 'గజ' అని పేరు పెట్టగా, ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1,140, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 1,180 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని గత రాత్రి ఐఎండీ (భారత వాతావరణ విభాగం) విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ లో పేర్కొంది.
ఇది నైరుతి దిశగా ప్రయాణించి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రవైపు వస్తోందని తెలిపింది. దీని ప్రభావంతో 13వ తేదీన రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని, సముద్రం అల్లకల్లోలమవుతుందని, గంటకు 135 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. వేటకు వెళ్లిన వారు వెనక్కు తిరిగి రావాలని సలహా ఇచ్చింది. కాగా, ఈ తుపానుకు శ్రీలంక 'గజ' అన్న పేరును సూచించింది. దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న ఏపీ సర్కారు, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం రేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద సూచికను జారీ చేశారు.